ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 7:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కమ్యూనిస్ట్ పార్టీలతో జగన్ ములాఖత్

నెల్లూరు, సెప్టెంబర్ 26,అర్జున్ సమాచారం:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ రాజకీయ వ్యూహంలో వస్తున్న మార్పులను స్పష్టంగా సూచిస్తున్నాయి. ఓడిపోయాక కూడా జగన్ రెడ్డి విధానాలను, శైలిని అత్యంత తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, అనూహ్యంగా నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తమ పార్టీ నిర్వహించే సదస్సుకు హాజరు కావాలంటూ జగన్‌ను ఆయన ఆహ్వానించడం కేవలం ఒక సాధారణ మర్యాదపూర్వక భేటీ ఎంతమాత్రమూ కాదు.గతంలో సీపీఐ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో కీలక సదస్సులు, చర్చా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, వైఎస్సార్‌సీపీని , జగన్ రెడ్డిని ఏనాడూ భాగస్వామ్యంగా ఆహ్వానించిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు రాత్రికి రాత్రే సీపీఐ వైఖరిలో ఈ మార్పు రావడానికి వెనుక జాతీయ స్థాయి ఇండియా కూటమి అగ్రనేతల స్పష్టమైన సూచనలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే క్రమంలో, ఏపీలో వైఎస్సార్‌సీపీని మెల్లగా కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి వైపునకు తిప్పుకునేందుకు కమ్యూనిస్టులను దూతలుగా వాడుకుంటున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.మరోవైపు జగన్ రెడ్డి కూడా ఈ పరిణామాలను తన రాజకీయ రక్షణ కవచంగా, వ్యూహాత్మక ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉంటూ తనపై ఉన్న కేసులు, ఇతర అంశాల్లో లబ్ధి పొందిన జగన్, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయాక జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ దారులను వెతుక్కుంటున్నారు. కమ్యూనిస్టులతో వేదికలు పంచుకోవడం ద్వారా, అవసరమైతే తాము కాంగ్రెస్‌తో జతకట్టడానికి కూడా సిద్ధమేనన్న సంకేతాలను ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు పంపుతూ ఒకరకమైన రాజకీయ బ్లాక్‌మెయిలింగ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తమ కేసులు, వ్యవహారాల విషయంలో ఈడీ దూకుడును తగ్గించాలన్నది ఆయన ప్లాన్ కావొచ్చు. సీపీఐ నాయకులను సజ్జల రామకృష్ణారెడ్డి వెంటబెట్టుకుని స్వయంగా జగన్ వద్దకు తీసుకు వచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ ప్రభుత్వంపై వామపక్షాలు నిరంతరం పోరాటాలు చేయగా, మారిన రాజకీయ సమీకరణాలతో ఇప్పుడు అదే వామపక్ష నేతలను సజ్జల తాడేపల్లి గడప తొక్కించి అధినేతతో ముచ్చటించేలా చేయడం వెనుక ఏదో ఒక ప్రతిపక్ష ఐక్యత వ్యూహం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఆహ్వానం వరకు బాగానే ఉన్నా.. విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ భేటీకి జగన్ స్వయంగా హాజరయ్యే అవకాశాలు లేవు. ఉమ్మడి వేదికలపైకి రావడం గానీ, ఇతర పార్టీలు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాలకు స్వయంగా వెళ్లి కూర్చోవడం గానీ జగన్ రాజకీయ శైలిలో ఎన్నడూ కనిపించని వ్యవహారం. సీపీఐ నిర్వహించే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరఫున ఒక అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపిస్తారా అన్నది కూడా క్లారిటీ లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజా సమస్యలపై అందరితో కలిసి పనిచేయడానికి సానుకూలత వ్యక్తం చేసిన జగన్.. ఏదైనా ఉంటే తమ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనాలి కానీ.. తాము వేరే వారి కార్యక్రమాల్లో పాల్గొనడం ఏమిటని అనుకుంటారు.జగన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ రాజకీయ విధానం అత్యంత ప్రమాదకరమైన మలుపులకు దారితీసే అవకాశం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో తమకున్న పాత వైరాన్ని, విభజన మచ్చను పక్కనబెట్టి సొంత ప్రయోజనాల కోసం దొడ్డిదారిన పొత్తులకు పావులు కదపడం ద్వారా ఆయన తన సిద్ధాంత రాహిత్యాన్ని బయటపెట్టుకుంటున్నారు. సీపీఐ రామకృష్ణ రాయబారంతో ప్రారంభమైన ఈ ప్రహసనం.. రేపటి రోజున వైఎస్సార్‌సీపీని కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా నిలబెట్టే దిశగా సాగుతున్న మొదటి అడుగు అనడంలో సందేహం లేదు. బీజేపీపై ఒత్తిడి పెంచడానికి ఒకవైపు కమ్యూనిస్టులను వాడుకుంటూనే, మరోవైపు రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారం మారితే తమ ఉనికిని కాపాడుకోవడానికి జగన్ వేస్తున్న ఈ రాజకీయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.
========================